పట్టనట్టుగా పలుకరించే ఆ పలుకులు వలపువాకిట వేసిన ముగ్గుని చెరిపేసి మది కిటికీలను కిర్రుమనిపిస్తుంటాయి! పలుచబడ్డ ప్రేమ చెప్పీ చెప్పని ఊసులు చెప్పానని పరువపు పాన్పును పరిచేసి కవ్వించే కులుకులని కలల్ని కడిగేస్తాయి! పరిచయాలకు పాకుడుగట్టి పులకరింతలు తడబాటై తడుముతున్న తలపు రాకాసి ఆగలేక సరదాగా సరసానికి రమ్మంటాయి! పసందుగా పై పైకి ఎగసే క్రొత్త పరిమళాలు పాత ఇంపు కంపుగా మారి గాలిలో కలిసి ఉత్సుకత ఉరకలేక చతికిలబడుతుంటాయి!
పువ్వులు విరబూసేది వాడిపోవడానికి రెండు హృదయాలు కలిసేది విడిపోవడానికి రేపన్నది రాక మరపు లేక గుండె గుబులు సెలయేరు సాగుతుంది మేఘం వర్షిస్తుంది హృదయం మాత్రం మంటల్లో కాలుతుంది దాహంతో మనసు కొట్టుమిట్టాడుతుంది చెప్పుకోలేని వేదన విషమైతే బాగుంటుంది!
నేను ఒక వ్యధాగీతాన్ని నా నిండా వేదనలే నిండి ఉన్నాయి నా ఆలాపనలో తానం పల్లవులలో పలికేది కేవలం వ్యధలే... స్వరకల్పన నిండుగా రసహీనతే వినేవాళ్ళ లేరు, ఉన్నా ఓహో అనరు గుండెను కలిచివేయగల జీవస్వరాలు శ్రోతలను శ్రవణానంద పరచలేను నా దుఃఖం సామవేదసారాలు నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు పాడాలని అనుకున్నా పలకలేని పాటను నేను మాత్రమే నడిచే గజిబిజి బాటను!!!