Wednesday, January 16, 2019

అనిశ్చల మనసు.

చంచల మనస్కులకు నిర్ధిష్ట సూత్రాలుండవు 
పలురంగులు మార్చి లోకంలో పరిభ్రమిస్తారు
అందంగా అలంకరించుకుని వెళ్ళి ఆరాటపడకు
న్యాయానికి నిగ్రహం ఉందనుకుని భ్రమపడకు!

మనసు మాచెడ్డది ఉద్వేగానికి హద్దులుండవు
కవ్వించే కళ్ళను చూసి రెచ్చిపోయి వెంటపడితే         
మామూలు మనిషినే మహాత్ముడిని అనుకోకు 
అమాయకత్వానికి నీతులు భోధించి పంపేయకు!

నడచి నువ్వు వస్తుంటే ఎవరిని నమ్మి ఉండను 
నిన్ను పుట్టించిన దేవుడే చూసి నిగ్రహించుకోలేడు
నా కళ్ళలో దాచుకుంటాను కౌగిలించుకో కాదనకు  
నిలువెత్తు సౌందర్యాన్ని చూస్తూ చలించ వద్దనకు!

Tuesday, September 25, 2018

వలపు పలుకులు

పట్టనట్టుగా పలుకరించే ఆ పలుకులు
వలపువాకిట వేసిన ముగ్గుని చెరిపేసి
మది కిటికీలను కిర్రుమనిపిస్తుంటాయి!

పలుచబడ్డ ప్రేమ చెప్పీ చెప్పని ఊసులు
చెప్పానని పరువపు పాన్పును పరిచేసి  
కవ్వించే కులుకులని కలల్ని కడిగేస్తాయి!

పరిచయాలకు పాకుడుగట్టి పులకరింతలు
తడబాటై తడుముతున్న తలపు రాకాసి 
ఆగలేక సరదాగా సరసానికి రమ్మంటాయి!

పసందుగా పై పైకి ఎగసే క్రొత్త పరిమళాలు
పాత ఇంపు కంపుగా మారి గాలిలో కలిసి
ఉత్సుకత ఉరకలేక చతికిలబడుతుంటాయి!

Friday, August 10, 2018

ప్రేమజాలం

నీ చూపుల భావాలతో నను మైమరపించావు 
కదిలే ఒక నదిలా...ఎగసే ఒక తరంగంలా
పచ్చని పైరులా మా పెరటిలోన సీతకోక చిలుకలా 
చిన్ననాటి మా గుడిసే గూడులోని గువ్వలా 
వయ్యారంగా వంపులు తిరిగిన మా ఊరి వాగులా 
తొలకరి జల్లుకి పులకరించిన పుడమితల్లి మట్టివాసనలా
నా మదిలో ఒక మెరుపులా మెరిసావు
అంతలోనే...అంతులేని అగాధాన్ని సృష్టించి
మది మైదానాన్ని ఎడారిల చేసి తెరమరుగైనావు
మేఘమై కరిగావు చినుకై రాలినావు నేలనే తాకావు
వరదై పారి ఏరులో మునిగి చెరువులో చేరావు 
కాలువలా చీలిపోయి సముద్రములో కలిసిపోయావు..

Wednesday, July 11, 2018

బొమ్మలాంటి మనసు

హృదయాన్ని బొమ్మచేసి 
నీకు ఇచ్చాను..
పొరపాటున కూడా
దాన్నీ తృంచివేయకు..
నీనా ప్రేమ జతాయే 
దాన్నెవరికీ పంచకు..
జన్మాంతం సాగే పయనం 
మధ్యలో వీడకు..
నేరం చేసిన నిన్ను
క్షమించానని వదలకు
చేసిన బాసలను మరచి 
దారి మరలిపోకు!

Tuesday, March 6, 2018

వేదన

పువ్వులు విరబూసేది వాడిపోవడానికి

రెండు హృదయాలు కలిసేది విడిపోవడానికి 

రేపన్నది రాక మరపు లేక గుండె గుబులు 

సెలయేరు సాగుతుంది మేఘం వర్షిస్తుంది 

హృదయం మాత్రం మంటల్లో కాలుతుంది

దాహంతో మనసు కొట్టుమిట్టాడుతుంది

చెప్పుకోలేని వేదన విషమైతే బాగుంటుంది! 

Thursday, February 1, 2018

నా పాట..

నేను ఒక వ్యధాగీతాన్ని 
నా నిండా వేదనలే నిండి ఉన్నాయి
నా ఆలాపనలో తానం పల్లవులలో
పలికేది కేవలం వ్యధలే... 
స్వరకల్పన నిండుగా రసహీనతే 
వినేవాళ్ళ లేరు, ఉన్నా ఓహో అనరు 
గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను శ్రవణానంద పరచలేను
నా దుఃఖం సామవేదసారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు 
 పాడాలని అనుకున్నా పలకలేని పాటను
నేను మాత్రమే నడిచే గజిబిజి బాటను!!!

Tuesday, November 28, 2017

ఎదలో ఏదోఎదలో సవ్వడులు నీ వల్లే... 
మదిలో అలజడులు నీ కోసమే
మది తాపత్రయ పడును నీ కొరకే
నిన్ను చూడాలని కనే కలలు 
నీవు లేక సెలయేరైనవి కనులు
ఎదలో దాగున్న ఇష్టాలను తెలపే
ప్రయత్నం చేస్తున్నా పలుమార్లు 
మన మధ్య జరిగిన ఘర్షణలని
మరి కొన్ని సరదా సంఘటనలని
ఎడబాటుని తట్టుకోలేక నీవు లేక 
ఎక్కడ ఉన్నావో తెలుసుకుని 
ఈ క్షణమే చెంతకు చేరాలనిపిస్తుంది!!

Wednesday, October 11, 2017

నా నువ్వు

జీవితమంటే నీ నా కధల సమ్మేళనం
కొన్ని కోల్పోతూ పోయినవి దొరకడం
లైఫ్ అంటేనే వచ్చి పోవడమని అర్థం
గడియల్లో జీవితకాలాన్ని దొంగిలించడం
నువ్వు ఎగసిపడే సాగరం నేను తీరం
నీవు నాకు నేను నీకు తోడు నీడలం
కళ్ళు సాగరమైనా, కోర్కెల జలపాతం!

Thursday, September 21, 2017

పరవశం

వెన్నెలను తాకిన కలువరేకులు 
ఎదను జల్లుమనిపించి మత్తు జల్లి
మూతపడిన కళ్లలో కలలను రేపి
తారలను తరిమి తాను మాయమై
కిరణాలను తొందరచేసి పిలిచి...
ఎర్రబడ్డ కళ్ళు ఏమైందని ప్రశ్నించ
బిత్తర పోయిన మనసు తలవాల్చి 
నీ వెచ్చని చూపుకు దాసోహమంటూ
నీ మరలి రాకకై చూస్తూ గడపసాగెను! 

Monday, August 28, 2017

మరిచాం

మనం మైత్రిని మంచితనాన్ని మరిచాం

బ్రతికి ఉన్నాం కానీ జీవించడం మరిచాం

పరిమళం ఆస్వాధిస్తూ పూలని మరిచాం

అవసరానికి ఆదుకున్న వారిని మరిచాం

కోరికల్ని బేరసారమాడి ప్రేమను మరిచాం 

చావు భయంతో కన్న వాళ్ళని మరిచాం

ఇప్పుడు మైనం కరిగి రాయిగా మారదు 

త్యాగమంటూ ఎవరిపై ఎవరికీ దయలేదు

గమ్యం చేరాలనే ఆత్రుతలో దారి మరిచాం