సంధ్యవేళ మామిడితోటలో
చల్లని వెన్నెలకి చెట్టు క్రింద
ఆకుమాటు పిందెలు తడవ
ఆమని భళ్ళున వెల్లివిరియ
ఎచ్చట నుండి వాలెనో గోరింక
చెట్టుకొమ్మల్లో ఊయల ఊగుతూ
కుహూ రాగాలు కొంటెగా కూయ
విన్న చిలుక పరవశంతో నవ్వ
గమ్మత్తుగా రెండు ఏకమాయె!
తారల నడుమ తారగా నేనుంటా
చంద్రుడివై వెన్నెల కురుపించవా
ప్రియతమా పంతం పగ్గాలు వీడి..
నన్ను నీ ఒడిలో బంధించుకునవా
ప్రేమ మత్తులో ఉన్నాను ఒడిసిపట్టి
నిద్రపోబోతే మేల్కొలిపి తీసుకెళ్ళవా
జీవితం అంతమైపోతుంటే ఓదార్చి..
ప్రేమకు అంతం లేదని చాటిచెప్పవా!
నేను తట్టుకోలేనంతగా ప్రేమించకు
నాకు అందనంత దూరంగా నీవు ఉండకు
నువ్వు ప్రేమించలేనంత నిన్ను ప్రేమించానని
నీ ప్రేమని నాకు చెప్పడం మరువకు..
నేను లేని ఒంటరితనాన్ని ఊహించకు
నన్ను తలచి మౌనంగా రోధించకు
నా ప్రేమని నీవు మరిచే ప్రయత్నం చేస్తూ
నిన్ను మరువమని నన్ను శపించకు..
సైగచేయగానే సన్నగా ఈలవేసి
సంబరంతో సరసానికి వచ్చేయి
మూగభాషలో భావాన్ని పసిగట్టి
జాగుచేయబోకు జామురేతిరి
తెల్లవారిందంటే మనకి మిగిలేది
వెలుగుతో కలవని చీకటి చిరాకులే
పలుకరించలేని పని పరాకులే...