Wednesday, November 21, 2012

నీవు లేని రోజు

అదే దారి అదే పయనం నాది ప్రతిరోజు...
ఈ పయనమెంతో భారం నీవు లేని రోజు!


నీవు నా చెంతన లేవని తెలిసి
ప్రతిచిన్ని విషయంలో నీవున్నట్లు
నీతో గడిపిన క్షణాలు అల్లరిచేస్తూ
నన్ను నానుండి దూరంచేస్తున్నాయి!


నా కమ్మని కలవని తెలిసికూడా
నిర్మించని మేడలేవో కూలినట్లు
రంగులన్నీ కలిసి నల్లగామారిపోతూ
నన్ను అ
గాధంలోకి తోసేస్తున్నాయి!

తీరం చేరని అలవోలె ఎద ఎగసి
జీవితమే అంతమైపోయినట్లు
అంతలోనే నీవు చేయి అందిస్తూ
నాతోడన్న ఆలోచనలే ఊరడిస్తున్నాయి!

Saturday, November 17, 2012

ఎవ్వరు నీవు?

నా రేయి నీవే, పగలు నీవే
నా మౌనం నీవే, మాటా నీవే
నా బాట నీవే, గమ్యం నీవే
నా కల నీవే, కలవరము నీవే
నా అలుక నీవే, తీర్చేది నీవే
నా బలమూ, బలహీనతా నీవే
నా నిన్నలో నీవు, రేపట్లో నీవే
నా ఆశ నీవే, నిరాశవి నీవే
నా అద్దంలో ప్రతిబింబం నేవే
నా పాట నీవే పల్లవి నీవే
నా వేషం నీవే, భాషా నీవే
ఏమని చెప్పను నీవెవరో?
నా జీవన అభిలాష నీవని
నా అస్తిత్వపు రూపురేఖ నీదని
వాస్తవంలో నేను చూడని రూపానికి
స్వప్నజగతిలో నా మనోహరుడివని!!

Saturday, November 10, 2012

తెలుసుకో నన్ను

ఓయ్!....నీకిదో దురలవాటు
నన్ను అల్లరిపెట్టి ఏడిపించడం!

పల్లవి నాకన్నా బాగుందనడం

కుసుమ కురులు నిగారింపనడం
మీనాక్షి కళ్ళభాష్యం నాకు తెలపడం
నళిలో నాజూకు నాలో లేదనుకోవడం
చిట్టి చిరునవ్వుని చూసి పులకరించడం
మౌనికలా నాకు మాటలు రావనుకోవడం
వాసంతి వయ్యారాలన్నీ కావాలని కోరడం..

ఇదేమిటనడిగితే నన్ను వారిలో చూసాననడం

అమాయకంగా నీ మాటలు నమ్మాననుకోవడం
అన్నీ ఉన్న తెలుగమ్మాయిని అలా అనుకోవడం
తెలివైన వాడినని సంబరపడ్డమిలా నీ పొరపాటు!

Friday, November 2, 2012

మౌనకావ్యం

నా ఒంటరితనంలో ఎన్నో ఊహలు
నీవుంటే ఏవేవో ఊసులు చెప్పాలని...

నాకు తెలుసు నా దగ్గర నీవు లేవని
అయినా అనిపిస్తుంది నాలోనే ఉన్నావని...

నా చుట్టూ ఉన్న గాలితెమ్మెరల్లో 
నీ ఉనికి పరిమళం ఉసిగొల్పుతుంటే...

నాలో దాగిన నీవు చిలిపిగా నను తాకి
ప్రేమపక్షుల గూడొకటి పెనవేస్తుంటే...

మన మధ్యనున్న అడ్డుగోడలన్నీ తొలగి
మౌనమే కావ్యమై నీలో నేను ఏకమవ్వాలని!