నా మనసున ఉన్నది నీవేనన్నా వినిపించుకోవు
పగలంతా ఊసులాడినా రేయి కలలోకైనా రావు..
నీ ఏకాంతంలో నా ఆలోచనలకి తావైనీయవు
మరిస్తేకదా గుర్తు చేసుకోవడానికి అంటావు..
మాటలతో చేరువకమ్మంటే మౌనంగా వింటావు
నీ పెదవిపై నవ్వునౌదామంటే నాకన్నీరై వస్తావు..
ప్రేమతో బంధించ అందుకోను నీవు నా దరిలేవు
ఎన్నెన్నో జన్మల బంధం ఈ ప్రేమ అని అంటావు..
ఈ చెలిమికి అనురాగాల ఊపిరిని అందించరావు
ప్రతిక్షణం నీతో నేనంటే నీ ప్రాణమే నేనంటావు!!!
అలంకరించుకోవాలన్న ఆలోచనేరాదు
చంద్రకాంతితో మోమును కడగడంలేదు
సాగరంలో ముత్యానై స్నానమాడలేదు
శ్రావ్యమనై సంగీతమేదీ వినబడ్డంలేదు
ఆశాకిరణాలు ఏవీ నన్ను తాకడంలేదు
కాలికున్న మువ్వలు సడిచేయడంలేదు
గాలితెమ్మెరలు కూడా ఊసులాడ్డంలేదు
నీవు లేక ఏవీ సక్రమంగా జరగడంలేదు
నాలోనే దాగిఉన్నావన్నా కన్నీరాగలేదు
మరువలేని మనసు మాట వినడంలేదు
నీపై ఉన్నది ప్రేమని చెప్పడం నాకురాదు.
నిన్ను మరచిపోవాలన్న ప్రయత్నంలో నేనోడుతూ
నిన్ను తిట్టుకుంటూ మరవలేకపోతున్నా ఎందుకంటే
మరచిపోవాలన్నా నిన్ను తలవాల్సిందేకదా అందుకని!
నిన్ను తలుస్తూ మన ఊసులన్నీ అలా జ్ఞాపకం వస్తూ
నిన్ను మరువలేకున్నా, నీవే చెప్పు మార్గమేదైనుంటే
మరచిపోతున్నా నిన్ను మరచిపోవాలన్న సంగతిని!
నిన్ను మరువక మిగిలిన సంగతులన్నీ మరచిపోతూ
నిన్ను మరిచానన్న అబధ్ధాన్నే నిజం అనుకునేకంటే
మరువలేని మధురస్మృతులను పలుమార్లు తలుస్తూ
నాతో లేవన్న విషయాన్ని మరచి నాలో ఉన్నావనుకోని!
అందరాని చందమామ అసలొద్దు
నాకు నచ్చినోడే నాకెంతో ముద్దు
రాముడు, కృష్ణుడు అసలే వద్దు
నన్ను వలచినోడే నాకు ముద్దు!
ఐదడుగులున్నా ఆజానుబాహుడే
చిన్నిమేడున్నా పెద్దమనసున్నోడే
తెలివితేటల్లో నన్ను మించినవాడే
నామాట ఎన్నడూ జవదాటనివాడే!
నా కొంగు పట్టుకుని వదలని నావాడు
అత్తమామలంటే అమ్మానాన్నలంటాడు
మోముచూడక మనసందం చూసేవాడు
అమ్మాయిల కలలరాకుమారుడు వాడు!
అడిగితే అందించే ఆస్తిపరుడు నాకసలొద్దు
అడగకనే అన్నీ అమర్చేవాడే నాకు ముద్దు
అతడే కనపడితే నా ఆనందానికిలేదిక హద్దు
అడగాన్నే ఇచ్చేయనా అతనికి నా తొలిముద్దు:-)