Tuesday, May 4, 2021

వస్తావా ప్రియా

ఊహాల్లో నేను నీతో విహరించిన వీధులు చూపిస్తా

స్వప్నలోకంలో నీతో సాదించే సరసాలు వివరిస్తా

నీ అందాన్ని అభివర్ణిస్తూ వ్రాసిన కవితలు వినిపిస్తా

నీ నిండైన రూపానికి గీసిన ప్రతిరూపాలు చూపిస్తా

నీ విరహంతో రగిలిన కార్చిచ్చులను చూపిస్తా

నీ ఎడబాటుతో కారిన కన్నీటి కడలిని చూపిస్తా

నీ అభిషేకం కై పెంచిన పూలతోటలు చూపిస్తా

నీ ఆరాధన కోసం కట్టిన పొదరిల్లులు చూపిస్తా

నావెంట రా ప్రేమసాగరం లోతుల్ని చూసేద్దాం!!

Sunday, February 28, 2021

నీవు నాతో

 

నాకు నువ్వొక పరిచయ పరిమళం మాత్రమే 

అలా వచ్చి వెళ్ళిపోయే వాన తుంపరవి నీవు 

అలా మెరిసి మాయమైపోయే మెరుపు నీవు 

గాలిని కోస్తూ మధురంగా వినపడే వెదుగానం 

చల్లగా మేనుతాకి మరలిపొయె సమీరం నీవు 

ఎందుకని అలా?????????

కలలా కరిగిపొయే కాలానివి కాకు నేస్తమా..

నా ఎద ప్రమిదలో నిత్యం వెలిగే దీపకాంతి నీవు

అలా వచ్చి నిత్యం గుండెలో కొలువుండిపో నీవు 

కాకుంటే నా చావు వెంట నాతో వచ్చెయ్ నీవు 

ఏమనుకోక ఎప్పటికీ నాలో కలిసిపోయి కరిపో నీవు 

Monday, August 31, 2020

మజిలీ


 మృత్యు వాహనంలో నిద్రించే రోజు

దిండూ ఉండదు పరుపూ ఉండదు

మిత్రుల జ్ఞాపకాలు మూల ఉంటాయి 

స్మశానవాటిక రమ్మని పిలుస్తుంది..

ఇదే నీ చివరి మజిలీ అంటుంది!!!

ఏదో సాధించి చాలి అనుకుని వెళ్ళావు 

వస్తూ ఏం తీసుకొచ్చావు అంటుంది..

మొత్తానికి ఏదో విధంగా ముగిసింది!! 

Sunday, February 23, 2020

నీ తోడుగా

పోగుచేసి పొందుపరిచిన ఎన్నో భావాలను 
నీతో పంచుకుంటూ నీ ఎదపై వాలిపోతాను 

చెల్లాచెదురై చెరిగిపోయిన నా చిరునవ్వును 
నీ చెలిమిలో చిత్రించి చిందులు వేయిస్తాను

ఒంటరితనం నా తోడని వెంటపడినా వెళ్ళను
నీ ఊహలతో ఊసులే చెబుతూ గడుపుతాను 

నిద్దుర రాక చచ్చిపోతున్న ఆకలి దప్పికలను
నీ జ్ఞాపకాల అరలలో అపురూపంగా దాచాను

గుండెల్లో అపురూపంగా దాచుకున్న కధలను 
నీ పరకరింపులతో పరామర్శిస్తూ ఉంటాను..   

Tuesday, June 18, 2019

ఎందరు?

ఎవరెవరో అడుగుతుంటారు
ఆనందమా నువ్వు ఎక్కడ ఉన్నావని?
ఎన్ని ప్రయోగాలు ఎందరు చేసారో
ఆనందమైన జీవితాన్ని తెలుసుకోవాలని 
కళ్ళనిండా ఉన్న కలలను 
ఎన్నింటినో సొంతంచేసుకోవాలని
శ్వాసను ఎప్పుడూ ఆపక ఊపిరి పీల్చాలని 
ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసారో
ఫలించని ప్రయత్నాలతో ఎందు అంతమైపోతున్నారో     

Friday, May 31, 2019

హృదయం

ప్రేమమొలక అలకల కులుకులు తళ్ళుక్కుమన
జారుపైట పైఎదను చూసి జారింది రసహృదయం  
విరిసి మురిసి పక్కున నవ్వింది పడతి పరువం!

పురివిప్పిన వయసు వంపులతో చేసింది నర్తన 
సొగసులను ఆస్వాధించ ఉరకలువేసె హృదయం
సుగంధ పరిమళాల సౌరభాలు విరిసె సుమధురం!

పాడెనులే కొమ్మల్లో ఊగుతూ కోయిల గమనం   
తిరోగమన మెరుగక సాగిపోయె కోరినహృదయం
అంగలార్చకుండేనా పరువంతో పెనవేసిన బంధం! 

Sunday, April 28, 2019

ఏమీలేవు

రేయింబవళ్ళు కళ్ళలో తేమ తప్ప 
మునపటి ఉత్సాహం జిజ్ఞాసా లేదు

ఉరుము మెరుపుల మేఘాలు తప్ప
వాన కురిసే ఛాయలు కనబడ్డంలేదు

మలుపులతో కూడిన మార్గాలు తప్ప 
ధైర్యంతో నడుస్తూ నడిపించే తోడేలేదు

మునుపటి ఆ ఆత్రుత ఆరాటమే లేదు
అప్పటి ఆ జ్ఞాపకాల అస్థిరనీడలు తప్ప 


Wednesday, January 16, 2019

అనిశ్చల మనసు.

చంచల మనస్కులకు నిర్ధిష్ట సూత్రాలుండవు 
పలురంగులు మార్చి లోకంలో పరిభ్రమిస్తారు
అందంగా అలంకరించుకుని వెళ్ళి ఆరాటపడకు
న్యాయానికి నిగ్రహం ఉందనుకుని భ్రమపడకు!

మనసు మాచెడ్డది ఉద్వేగానికి హద్దులుండవు
కవ్వించే కళ్ళను చూసి రెచ్చిపోయి వెంటపడితే         
మామూలు మనిషినే మహాత్ముడిని అనుకోకు 
అమాయకత్వానికి నీతులు భోధించి పంపేయకు!

నడచి నువ్వు వస్తుంటే ఎవరిని నమ్మి ఉండను 
నిన్ను పుట్టించిన దేవుడే చూసి నిగ్రహించుకోలేడు
నా కళ్ళలో దాచుకుంటాను కౌగిలించుకో కాదనకు  
నిలువెత్తు సౌందర్యాన్ని చూస్తూ చలించ వద్దనకు!

Tuesday, September 25, 2018

వలపు పలుకులు

పట్టనట్టుగా పలుకరించే ఆ పలుకులు
వలపువాకిట వేసిన ముగ్గుని చెరిపేసి
మది కిటికీలను కిర్రుమనిపిస్తుంటాయి!

పలుచబడ్డ ప్రేమ చెప్పీ చెప్పని ఊసులు
చెప్పానని పరువపు పాన్పును పరిచేసి  
కవ్వించే కులుకులని కలల్ని కడిగేస్తాయి!

పరిచయాలకు పాకుడుగట్టి పులకరింతలు
తడబాటై తడుముతున్న తలపు రాకాసి 
ఆగలేక సరదాగా సరసానికి రమ్మంటాయి!

పసందుగా పై పైకి ఎగసే క్రొత్త పరిమళాలు
పాత ఇంపు కంపుగా మారి గాలిలో కలిసి
ఉత్సుకత ఉరకలేక చతికిలబడుతుంటాయి!

Friday, August 10, 2018

ప్రేమజాలం

నీ చూపుల భావాలతో నను మైమరపించావు 
కదిలే ఒక నదిలా...ఎగసే ఒక తరంగంలా
పచ్చని పైరులా మా పెరటిలోన సీతకోక చిలుకలా 
చిన్ననాటి మా గుడిసే గూడులోని గువ్వలా 
వయ్యారంగా వంపులు తిరిగిన మా ఊరి వాగులా 
తొలకరి జల్లుకి పులకరించిన పుడమితల్లి మట్టివాసనలా
నా మదిలో ఒక మెరుపులా మెరిసావు
అంతలోనే...అంతులేని అగాధాన్ని సృష్టించి
మది మైదానాన్ని ఎడారిల చేసి తెరమరుగైనావు
మేఘమై కరిగావు చినుకై రాలినావు నేలనే తాకావు
వరదై పారి ఏరులో మునిగి చెరువులో చేరావు 
కాలువలా చీలిపోయి సముద్రములో కలిసిపోయావు..