Tuesday, November 28, 2017

ఎదలో ఏదో



ఎదలో సవ్వడులు నీ వల్లే... 
మదిలో అలజడులు నీ కోసమే
మది తాపత్రయ పడును నీ కొరకే
నిన్ను చూడాలని కనే కలలు 
నీవు లేక సెలయేరైనవి కనులు
ఎదలో దాగున్న ఇష్టాలను తెలపే
ప్రయత్నం చేస్తున్నా పలుమార్లు 
మన మధ్య జరిగిన ఘర్షణలని
మరి కొన్ని సరదా సంఘటనలని
ఎడబాటుని తట్టుకోలేక నీవు లేక 
ఎక్కడ ఉన్నావో తెలుసుకుని 
ఈ క్షణమే చెంతకు చేరాలనిపిస్తుంది!!

Wednesday, October 11, 2017

నా నువ్వు

జీవితమంటే నీ నా కధల సమ్మేళనం
కొన్ని కోల్పోతూ పోయినవి దొరకడం
లైఫ్ అంటేనే వచ్చి పోవడమని అర్థం
గడియల్లో జీవితకాలాన్ని దొంగిలించడం
నువ్వు ఎగసిపడే సాగరం నేను తీరం
నీవు నాకు నేను నీకు తోడు నీడలం
కళ్ళు సాగరమైనా, కోర్కెల జలపాతం!

Thursday, September 21, 2017

పరవశం

వెన్నెలను తాకిన కలువరేకులు 
ఎదను జల్లుమనిపించి మత్తు జల్లి
మూతపడిన కళ్లలో కలలను రేపి
తారలను తరిమి తాను మాయమై
కిరణాలను తొందరచేసి పిలిచి...
ఎర్రబడ్డ కళ్ళు ఏమైందని ప్రశ్నించ
బిత్తర పోయిన మనసు తలవాల్చి 
నీ వెచ్చని చూపుకు దాసోహమంటూ
నీ మరలి రాకకై చూస్తూ గడపసాగెను! 

Monday, August 28, 2017

మరిచాం

మనం మైత్రిని మంచితనాన్ని మరిచాం

బ్రతికి ఉన్నాం కానీ జీవించడం మరిచాం

పరిమళం ఆస్వాధిస్తూ పూలని మరిచాం

అవసరానికి ఆదుకున్న వారిని మరిచాం

కోరికల్ని బేరసారమాడి ప్రేమను మరిచాం 

చావు భయంతో కన్న వాళ్ళని మరిచాం

ఇప్పుడు మైనం కరిగి రాయిగా మారదు 

త్యాగమంటూ ఎవరిపై ఎవరికీ దయలేదు

గమ్యం చేరాలనే ఆత్రుతలో దారి మరిచాం 

Thursday, July 20, 2017

తెరచిన పుస్తకం

ఇదేం జీవిత ప్రయాణమో అర్థం కావడంలేదు
ఎవరైనా అర్థంకాని ఈ పొడుపుకధను విప్పండి 
అభీష్టాల్ని తీర్చే అభయం కోసమే అన్వేషణ
సాగరమన్ని స్వప్నాలున్నా కనులు బీడుబారినవి
ఇవేమి ఆశల అలలో తనలో నన్ను ముంచేస్తున్నవి 
ఇదేమి వెర్రితనమో ఇంతటి లగ్నమెందుకో తెలియదాయె
హ్రుదయం మాత్రం వెంపర్లాడుతుంది కోరికల కస్తూరికై
నింగి నుండి నేల వరకూ నా చేతులు చాచి ఉన్నాయి 
ఇది కలో నిజమో ఎవరైనా తేల్చి చెప్పండి
తెరచిన పుస్తకం చదివి బయట లోపల ఒకటని తేల్చండి..

Sunday, May 21, 2017

తీరని కలలు

మనసు కోరిన వాటిని కనులు దూరం చేసెనని 
ముక్కలైన కలలు చెప్పలేనంటూనే చెప్పేసాయి!

దరిచేరి దక్కని వాటిపైనే ప్రాకులాట అధికమని 
విరిగిన మనసే వివరించి వేదనతో ఓదార్పు కోరే!

అసలు ఆశించింది ఏమిటి చివరికి మిగిలిందేమని 
ఆవిరైన కన్నీరే అలసిన మనసుని ప్రశ్నించింది!

కోరికలు నింగిని తాకొచ్చి మరల దరి చేరలేనని
ప్రపంచాన్నే వెలివేసి ప్రాణం వదిలి గాలిలో కలిసె!  

Monday, February 6, 2017

తప్పెవరిదో?


నువ్వు మోసగాడివని తెలిసి భాధకాదు
నిన్ను మార్చాలని ప్రయత్నించిన వారు
ఓడిపోయారు అని తెలిసి దిగులంతా
కొంతుకోసి నీవు చెప్పంటున్నావు
మనసులోని మాటను విప్పమంటున్నావు
కనురెప్పలు తడిసి ముద్ద అయినాయి
మన మధ్య మాటలు అంతమైనాయి
తప్పెవరిదో తెలీదు కాలానిదా మారిన మనదా 
నిన్ను మరవడానికి కొంచెం వ్యవధి కావాలి
నీలా మోసంచేయాలంటే సమయం కావాలి!