Sunday, December 14, 2014

ఈ జన్మ

మళ్ళీపుట్టిన నాకు మరుపన్నది వరమైనది
ఏ బాంధవ్యమూ వద్దు నీకు నీవే తోడన్నది!

అనిశ్చల అంతరంగమైతే ఉప్పెనై రోధిస్తుంది
మరల తనకితానే సర్దిచెప్పుకుని సాగుతుంది!

కోయిలనై కూయాలనుకుని కాకిలా అరిచింది
నవ్వుతున్న ప్రతి ముఖంలో సంతోషంలేదంది!

తనువుపై గాయాలు మార్పే మందు దొరికింది
మనసుగాయం మార్చమని మరణాన్నే కోరింది


Saturday, November 15, 2014

చాలు!

నాకు అవసరమైన మేరకే ఆశిస్తాను
అనుకున్నది నెరవేరితే అంతే చాలు!

నాలోని క్రోధానికి కళ్ళెంవేసి ఆపుతాను
అంతే శాంతి నన్ను ఆవహిస్తే చాలు!

నా శక్తికి మించిన సహాయమే చేస్తాను
అలజడి లేని జీవితమైతే అంతే చాలు!

నాకుతెలిసీ నిస్వార్థంగా వ్యవహరిస్తాను
అందినంత ఆనందం నాకు దక్కితే చాలు!



Monday, October 20, 2014

ప్రణయం

కనులు మౌనంగా ఊసులే చెబుతాయి...
అర్థం చేసుకోగలిగితే గ్రంధాన్నే విప్పుతాయి.
ఎవరన్నారు కనులు రోధిస్తున్నాయని...
మనసు ఏడిస్తే కళ్ళు దాన్ని చెబుతున్నాయి.
వింతవిఢ్యూరాల మిళితమీ ప్రణయం
ఎప్పుడు మొదలౌతుందో ఎలా ముగుస్తుందో
తెలుసుకుని మసలడం చాలా కష్టం....
గమ్యం ఏంటో నీకు తెలియదు నాకు తెలియదు
వెలిగే దీపంతోపాటు పొగలువతుంటాయి
జ్ఞాపకాలెన్నో నిద్రలేని రాత్రులు అవుతాయి.

Tuesday, September 9, 2014

ఎలా!?

ప్రేమలో పసిదాన్ని నేను,
ప్రేమించానని చెప్పేది ఎలా!
ఎంత ప్రేముందో చూపేదెలా?

నీవంటే నాకు చాలా ఇష్టం
గుండె నిండి నీవని చెప్పేదెలా!
నిన్ను నేను పొందేది ఎలా?

ప్రణయ తాపం నాలో ఎగసెనని
నీలోనూ ఆ మంటలు రేగెనేల!
జ్వాలనార్పే మార్గమేదో చెప్పవేల?

మనసు నీవు నావాడివంటున్నది
నీకు ఉన్న ప్రేమనైనా చూపించవేల!
సంబంధమేదో పెనవేసెయ్యి ఏదోలా.

Sunday, August 31, 2014

చలనం

నా గుండె గళం విప్పితే తెలిపేది....
నీ అచేతన మనసుకి అర్థమయ్యేలా

నా మనసుకే మాటలు వస్తే పలికేది....
మౌనమే మూటలమాటలు వెదజల్లేది

నా కవితలకే ప్రాణం వస్తే తెలిపేది....
ప్రతి అక్షరంలో దాగిన భావ సవ్వడిని

నా కవళికలకే చలనం ఉంటే చెప్పేవి
చెరిపేసినా చెరగని గుర్తులనే చూపేవి

Tuesday, August 5, 2014

చాలు చాలు

తడవకో రంగుమార్చి ప్రలోభ పెట్టే గుండెలు వేలు..
మండుతున్న గుండెను చల్లార్చే ఒక్కరుంటే చాలు!

వాంఛల సరిహద్దుదాటి కదలని అడుగులు మెండు
కష్టాల్లో కడదాకంటూ తోడు ఉండేవారు ఎందరుండు?

దొంగలా దాక్కొని ఆచితూచి ప్రేమను పంచే దొరలు..
బరువు భాధ్యతలు మాత్రం భరించలేని బడాబాబులు!

మజిలీకి చేరువయ్యే మలుపుల్లో ఎప్పటికీ చేజిక్కనిది
సొంతం అంటూ పొందలేని విచిత్ర వలయ జీవితమిది

Sunday, July 13, 2014

మనసుతో

మాటలతో కాదు మనసుతో ముచ్చటించు

మనసా వాచా మాటిచ్చి తప్పొప్పులెంచకు

ఎదసడి ఒకటని లయతప్పించి నవ్వుకోకు

చాటుమాటుగా హొయలు చూసి మురవకు

ఇంకిపోయిన ఇంగితంతో మాటను మార్చకు

నీలో నిన్ను చూసుకోకుండా నన్ను చూడకు

మనసునికాక మాటల్లో మర్మాన్ని వెతకమాకు

వేదన వెసులుబాటు కాలేదని ప్రేమనే కాదనకు

Sunday, May 25, 2014

మనకోసం మనం

అంబరం అంచుల్ని తాకాలనికాదు నా ప్రయత్నం

హృదయపు గదిలో కొలువుండాలన్నదే ఆశయం

గడచిన గతాన్ని మరచి జ్ఞాపకాల జాబితాలో చేర్చి

గమ్యం ధేయం గుర్తుచేసుకుని సాగిపో నవ్వుతూ....

ఒడిదుడుకులున్నా, జీవితమే వెలితిగా అనిపించినా

ఆనందంగా ఉన్నామన్న భ్రమలో సాగితే అదే సంతోషం

నీవు మనస్ఫూర్తిగా చేసిన పనిని నీవే మెచ్చుకో....

నిన్ను నిందించడానికి లోకం కాచుకునుందని గుర్తుంచుకో

Friday, April 25, 2014

నీవులేని

నీవు లేకుంటే రేయి నాకు నిదుర రానేరాదు
నీవు నాతో ఉంటే మన చెంతకు నిదురరాదు
అది వేదనలో జాగరణైతే ఇది వెన్నెలలో వేకువ

పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
భారమైన మదిని బంధించలేను భరించలేను
మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో

నా ప్రాణం కంటే నీవంటేనే నాకెంతో మక్కువ
చావుకంటే నీ ఎడబాటంటేనే భయం ఎక్కువ
నీవులేని నేను బ్రతికున్న శవంకంటేం తక్కువ

Friday, April 4, 2014

నుదుటిరాత

నిశిరేయి నిదురలో నిన్ను అడిగాను
నన్ను వీడి దూరమయ్యావెందుకని?
నీ కంట జారే నీరు చూసి ఏమడగను
మరి ఎందుకు నన్ను  ఏడిపించావని!


               
నాకు తెలుసు నన్ను నీవు మరిచావని
నీవు అనుకోకు నేను నిన్ను మరిచానని
మనిద్దరి వలపూ ఎన్నటికీ వమ్ముకాదని
నీవుకాదు విధిరాతే నన్ను వంచించిందని!


                   
మదిలో ఉన్న నీవు నుదుటన వ్రాసిలేవు!!
నుదుటిన వ్రాసి ఉన్నవాడు మదిలోన లేడు

Wednesday, February 19, 2014

నావాడివి

నా ఆలోచల్లో మసగబారిన చిత్రానివి
అయినా జీవితానికి ఒక చిగురాశవి!


నాకే తెలిసీ తెలియని చూడని నేస్తావి
అయినా మది నమ్మిన నమ్మకానివి!


నా ప్రార్ధనలో పడిలేచే నిట్టూర్పుసెగవి
దూరాలు తరగని కలవాలన్న కోరికవి!


కలిస్తే కంటజాలువారే ఆనందభాష్పానివి
నన్నే తలచి నాతోనే ఉన్న నా ఊపిరివి!


ఎదసడి చెడిపిన మంచి మనసున్నోడివి
చెడ్డవాడివైనా నా పెదవిపై చిరునవ్వువి!


నా ఎన్నో జన్మల నిరీక్షణా సత్ఫలితానివి
చెంతచేరిన ఊహకందని ఉన్నతమైన వ్యక్తివి!

Thursday, February 6, 2014

ప్రేమరాగాలు

చాలు చాలు...ఈ దాగుడు మూతల సరసాలు
కనుదోయి వెనుక దాచబోకోయి అనురాగాలు
అందీయి చాన్నాళ్ళుగా అణగారిన మురిపాలు
జత కట్టేద్దాం మన ఇద్దరి వలపు దొంతరలు...

ఆగు ఆగు... దోచేయమాకు నాలోని సొగసులు
మనసైన వానికే అందించెదను ఈ వయ్యారాలు
ఊరించి ఇచ్చుటలో ఉన్నవి ఎన్నో గిలిగింతలు
పెనవేసుకుని పాడుకుందాం ప్రేమసరాగాలు...

లేనే లేవు... మన ప్రేమకు ఎటువంటి అడ్డుగోడలు
రానే రావు మనమధ్య ఏ విధమైన పొరపొచ్చాలు