Monday, October 29, 2012

ఏది ఒప్పో?

పుట్టిన దగ్గర నుండి పెరుగు పెరుగన్నారు..
పెరుగుతుంటే పలుకులు నేర్చుకోమన్నారు..
పలుకులు నేర్చిన నన్ను బడికి పంపారు..
ఓనమాలు దిద్దేలోపు అన్నీ నేర్వమన్నారు..
ఆటలాడుకునే నాకు పోటీతత్వం నేర్పారు..
అన్నింటిలో ఫస్ట్ రావాలంటూ ఒత్తిడి చేసారు..
ఆలోచనతో అడుగేసి నిర్ణయించి నిలబడమన్నారు..
నిలకడగా నిలబడుతుంటే నిబంధనాల్లో నిలబెట్టారు..
ప్రేమంటే తెలియకముందే పెళ్ళిచేసుకోమంటున్నారు..
ఇప్పుడొద్దంటే ఏ వయసులో ఆ ముచ్చటంటున్నారు..
ఎవరిది రైట్ అంటారో? నాతో ఎంతమంది సమ్మతిస్తారో?

Tuesday, October 23, 2012

ఏమి చెప్పను..ఎలాగ చెప్పను?

ఆప్యాయంగా ఆహ్వానించిన అందరికీ వందనాలు
ఎక్కడ్నుండి ఎలా మొదలెట్టాలో అని అల్లాటపాగా
బాల్యంలో ఆటల గురించి చెప్పుకుందామంటే
పిల్ల పెరిగిందే కానీ మైండ్ ఎదగలేదంటారు!
చదువు సంధ్యల గురించి చెప్పుకుందామంటే
తాతకు దగ్గులు నేర్పుతుంది అనుకుంటారు!
లండన్ వింతలు విశేషాలు వివరించబోతుంటే
కొత్తవిషయాలు చెప్పు ఇవి తెలిసినవే అంటారు!
ప్రేమ గురించి కవితల్లి రాద్దామనుకుంటే
ఈ వయసులో ఇది ఒక పైత్యమంటారు!
మీ అందరి మనసులోని మాట ఏంటంటే
పండగ పూట బోర్ కొట్టించకు అంటారు!
వద్దన్నా కూడా చెప్పేంత చెడ్డపిల్లను కాను,
అందుకే అందరకీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను.

Monday, October 22, 2012

నా గురించి కొంత

అమ్మానాన్నల అనురాగానికి ప్రతీకగా
వారి వివాహమైన రెండేళ్ళకి విరబూసిన కుసుమాన్ని..."లిపి"ని 
అయిదేళ్ళు అమ్మఒడిలో 
ఆపై పదేళ్ళు బడిలో
ఆరేళ్ళు కాలేజీలో చదివి...
లండన్ లో విద్యనభ్యసించి పట్టాతో
ఏడాదిక్రితం అమ్మానాన్నలకు దగ్గరగా
ప్రస్తుతం ఉద్యోగంచేస్తూ....
చిత్రాలువేస్తూ, కవితలు రాస్తూ
లోకాన్ని విభిన్నకోణాల్లో చూస్తూ
అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ 
వాటిని మీతో పంచుకుంటూ.... 
మీ ద్వారా మరిన్ని తెలుసుకోవాలనే 
నా ఈ ప్రయత్నంలో మీరంతా మిత్రులని ఆశిస్తూ...

Saturday, October 20, 2012

లిపి చెప్పే ఊసులు

నమఃస్సుమాంజలి...
రెప్పలమాటున దాగిన కలలెన్నో మీతో పంచుకోవాలని
చిరునవ్వుల తొలిచినుకులు కొన్ని మీకు అందించాలని
నా ఊసులెన్నో చెప్పి మీ తలపుల్లో నేను మిగిలిపోవాలని
మీ స్నేహ హస్తాన్ని చూడామణిలా సిగన సింగారించుకుని
తప్పులన్ని సరిచేసుకుని కాటుకలా కంటికద్ది....సాగిపోవాలని
మీ తెలుగమ్మాయి....
లిపి చెప్పే ఊసులు వింటారు కదా!!!